TTD: క్యూలైన్లు, దర్శనాల్లో తాజా మార్పులు - ఎమ్మెల్యే కోటా పెంపు..!!
తిరుమలలో నూతనంగా ఏర్పడిన పాలక మండలి తొలి సమావేశం సోమవారం జరగనుంది. 80 కీలక అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గత పాలక మండలి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలను సమీక్ష చేయనుంది. అదే విధంగా భక్తులకు అమలవుతున్న క్యూ లైన్లు.. దర్శన విధానంలోనూ మార్పుల పైన నిర్ణయించనుంది. ఇక.. బోర్డు సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలకు దర్శన..సేవల కోటా పెంచుతూ నేటి సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు.
బోర్డు తొలి సమావేశం
టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు.. సభ్యుల నియామకం తరువాత తొలి సమావేశం నేడు (సోమవారం) జరగనుంది. ఈ సమావేశంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ వేసేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ప్రభుత్వంలో బోర్డు తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల న్నింటిపైనా చర్చించనున్నారు. సామాన్య భక్తులకు దూరమైన వైకుంఠం క్యూకాంప్లెక్స్-1ను పూర్తిస్థాయిలో తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల లో అన్యమత ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటుగా అన్యమతస్థులను ఉద్యోగులుగా కొనసాగించమని ఇప్పటికే ఛైర్మన్ స్పష్టం చేసారు.

ఎమ్మెల్యే కోటా పెంపు
లడ్డూలు, అన్నప్రసాదాల నాణ్యత పెంచేందుకు నూతన టెండర్లను ఆహ్వానించనున్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం పెద్దస్థాయిలో దుమారం రేపిన విషయం తెలిసిందే. నాణ్యమైన నెయ్యి కొనుగోలు, వాటి పరీక్ష నిమిత్తం ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ఉన్న శ్రీవారి దర్శన, సేవా టికెట్ల కోటా పెంపు పైన నిర్ణయం తీసుకోన్నారు. బోర్డు సభ్యులకు ఇక నుంచి సోమవారం నుంచి గురువారం వరకు ప్రతీ రోజు 20 బ్రేక్ దర్శన టికెట్లు, శని..ఆది వారాల్లో 12 చొప్పున జారీ చేయనున్నట్లు సమాచారం.
రాజకీయ ప్రసంగాలకు బ్రేక్
అదే విధంగా.. వారానికి నాలుగు కళ్యాణోత్సవం.. మరో నాలుగు సుప్రభాతం సేవల టికెట్లు బోర్డు సభ్యుల కోటాలో మంజూరు చేస్తూ నిర్ణయానికి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటా పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక పై వారంలో ఆరు రోజులు పాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇవ్వనున్నారు. తిరుమల దర్శనాలకు సంబంధించి ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు. తాజా నిర్ణయం మేరకు ఇకపై వాటిని ఆరు రోజులకు అనుమతించనున్నారు. అదే విధంగా సేవల్లోనూ వారి కోటా ఉండే విధంగా మార్పులకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. అలిపిరి వద్ద దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ ను పునరుద్దరించనున్నారు.












Click it and Unblock the Notifications