వైసీపీపై తొడగొట్టి - ఎమ్మెల్సీ సీటు పట్టిన గ్రీష్మ..!!
టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించారు. రెండు స్థానాలు బీసీ... ఒక సీటు ఎస్సీ కి కేటాయిస్తూ ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎస్సీ - మహిళా అభ్యర్దిగా కావలి గ్రీష్మకు అవకాశం దక్కింది. నామినేటెడ్ పదవిలో ఉన్నా.. గ్రీష్మను ఎమ్మెల్సీ గా ఎంపిక చేయటం వెనుక అనేక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ మహానాడు వేదికగా నాడు గ్రీష్మ తొడ గొట్టి వైసీపీకి సవాల్ చేసారు. పార్టీలో క్రియాశీలకంగా మారటంతో ఇప్పుడు ఏరి కోరి గ్రీష్మ ను ఎమ్మెల్సీ అభ్యర్దిగా అవకాశం కల్పించారు.
టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీల్లో గ్రీష్మ ఎంపిక ఆసక్తి కరంగా మారింది. బీటీ నాయుడు, బీదా రవిచంద్ర ఇద్దరూ ఎమ్మెల్సీలుగా చేసారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. 2014 లో టీడీపీ గెలిచిన తరువాత పార్టీలో గ్రీష్మ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష పార్టీ సభ్యురాలిగా నాటి ప్రభుత్వం పైన పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడేవారు. పార్టీ మహానాడు వేదిక నుంచి వైసీపీ నేతలను తొడ గొట్టి సవాల్ చేసారు. ఆ సమయంలో గ్రీష్మ ప్రయోగించిన భాష పైన కొన్ని అభ్యంతరాలు ఉన్నా.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు.

ఫైర్ బ్రాండ్ గా పేరున్న గ్రీష్మ 2024 లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. రాష్ట్ర మహిళ ఆర్దిక సంస్థ ఛైర్మన్ గా నియమితులయ్యారు. గతంలో సీఎంఓలో కమ్యూనికేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. గ్రీష్మ తాత కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా ..ఎమ్మెల్యేగా పని చేసారు.
తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఏపీలో మంత్రిగా .. శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు. ఇప్పుడు గ్రీష్మకు ఎమ్మెల్సీ ఖరారు వేళ నాడు పార్టీ మహానాడు వేదికగా వైసీపీ పై తొడ గొట్టిన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. ఎమ్మెల్సీ అవకాశం దక్కని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్వయంగా మాట్లాడుతున్నారు. భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications