అమరావతి విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సూచనలు జారీచేసింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాకుండా మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని ప్రకటించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు మూడు సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించగా 6 నెలల్లో రైతుల దగ్గర తీసుకున్న భూములను అభివృద్ధి చేసి అప్పగించాలని, రాజధానిలోని ఇతర పనులన్నీ పూర్తిచేయాలంటూ ఆదేశాలు జారీచేసింది.

6 నెలల్లో పనులు పూర్తిచేయడం సాధ్యం కాదంటూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మరోవైపు విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిని తరలించే పనులను ముమ్మరం చేస్తోంది. నేడో, రేపో విశాఖ నుంచి పరిపాలన ఖాయమని మంత్రులు ప్రకటిస్తున్నారు. ఇంకోవైపు అమరావతికి అనుకూలంగా 29 గ్రామాల్లో నిరసన శిబిరాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నుంచి అరసవెల్లి వరకు రైతులు తలపెట్టిన పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో అక్కడే నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications