ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
Bay of Bengal: బంగాళాఖాతాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరింత విస్తరిస్తోన్నాయి. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయి. దీనికి అనుకూల వాతావరణ పరిస్థితులు మరింత దోహదపడ్డాయి.
అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా తీరం వెంబడి వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది.

దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తోన్నాయి.
ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు పడే అవకాశం ఉంది.
వీటితో పాటు నంద్యాల, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గోదావరి, నాగావళి, వంశధార నదులకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందనీ అన్నారు. ఆయా నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రోణంకి కూర్మనాథ్ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే కృష్ణమ్మ వరద తాకిడికి గురైంది.
కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్‌పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనితో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
దీని ప్రభావం తెలంగాణపై పడింది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. జూరాల ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులుగా రికార్డయింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు.. ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం అందుకుంది. దీనితో అధికారులు రెండు రోజుల కిందటే జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు.












Click it and Unblock the Notifications