టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు-మరో ముగ్గురు అరెస్ట్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి జరిగింది. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వంటి నేతలు, వారి అనుచరులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇందులో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఒక్కకొక్కరిగా కీలక నేతల అనుచరులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఆధారాలను బట్టి వారిని అరెస్టులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరో ముగ్గురు వైసీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసారు. ఇవాళ మరో ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ సంఖ్య 8కి చేరింది. ఇంకా పలువురు అనుమానితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇవాళ అరెస్టు చేసిన వారిలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు సత్యం, గోపిరెడ్డి, లంక లబ్బినాయుడు ఉన్నారు. ఈ ముగ్గురు టీడీపీ కార్యాలయంపై దాడిలో నేరుగా పాల్గొన్నట్లు నిర్దారించారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు వరుసగా అరెస్టులకు దిగుతుండటంతో అనుమానితులుగా ఉన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు ఒక్కొక్కరిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. అయితే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. వచ్చే వారం మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన వీడియో ఫుటేజ్, ఇతర ఆధారాలతో వీరిని కోర్టులో హాజరుపర్చనున్నారు.












Click it and Unblock the Notifications