మలుపు తిరిగిన పిఠాపురం రాజకీయం..పవన్ కల్యాణ్ పేరుతో ముగ్గురు నామినేషన్లు..?
పీఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్‌ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. పవన్‌ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్‌ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలోనే పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పవన్ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో రాజకీయం మరో మలుపు తిరిగింది.పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరుతో మూడు నామినేషన్లు దాఖలైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కోనేటి పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ పేర్లతో ఉన్న ఓ పోస్టల్ బ్యాలేట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలో వాస్తవం లేదని తెలిసింది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే పోటీలో ఉన్నారని తేలింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 11మంది నామినేషన్ దాఖలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications