అలా చేస్తే శ్రీవారు ఉగ్ర నరసింహుడవుతాడు
Tirumala Laddu row: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 61,328 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,033 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

అటు- ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వు, చేప నూనెతో కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణల వేడి చల్లారట్లేదు.
ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవీలత శ్రీవారిని దర్శించుకున్నారు. సేవల్లో పాల్గొన్నారు. గురువారం రాత్రి ఆమె కాలినడకన అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం తిరుపతికి చెందిన బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ఏకం కావాలని కోరారు. ప్రతి ఒక్క హిందువూ మేల్కోవాలని, తమ గళాన్ని వినిపించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
హిందూయిజం, సనాతన ధర్మానికి ప్రమాదం వాటిల్లినా, ఒక్క చుక్క భక్తి తగ్గినా వేంకటేశ్వర స్వామి ప్రహ్లాదుడిని కాపాడటానికి వచ్చిన ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తాలని, హైందవ మనుగడకు ప్రమాదకరంగా మారిన వారిని శిక్షించాలని మాధవీలత అన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ హిందువులు ఏకం కాలేరని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications