ఎల్లుండి.. మీనలగ్నంలో తిరుమలలో.. !!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దగ్గరపడ్డాయి. సోమవారం సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. మంగళవారం ధ్వజారోహణతో ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు ఘనంగా ఆరంభమౌతాయి. దీనికోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేసింది. అశేష భక్తజనావళికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవ రోజుల్లోనే.. తిరుమల శ్రీవారి మ్యూజియం అందుబాటులోకి రానుంది.
ఎల్లుండి.. మీనలగ్నంలో..
బ్రహ్మోత్సవాల ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడు శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయానికి చేరింది. వీటిని టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రంగనాయకులవారి మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును భద్రపరిచారు. ఈ నెల 15న మంగళవారం సాయంత్రం 6:21 నుండి 6:35 నిమిషాల వరకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.

10 రోజుల ముందు నుంచే..
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేసింది.
తిరుమలలో వినియోగించే దర్భ ఇదే..
వీటిల్లో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉంటాయి. తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. దీనికోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి వారం రోజులపాటు ఎండబెట్టి, శుభ్రపరచిన అనంతరం చాప, తాడు తయారు చేశారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 200 కిలోల బరువైన దర్భ చాప, 250 మీటర్ల పొడవైన 100 కిలోల తాడు సిద్ధం చేశారు.
వేదాల్లో దర్భ ప్రాధాన్యత..
దర్భకు వైదిక శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. రుగ్వేదం, యజుర్వేదంలో దీని ప్రస్తావన ఉంది. దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన గొప్ప ఫలితాలను ఇస్తుందని వేదాలు చెబుతున్నాయి. శాస్త్రీయంగా చూసినా దర్భ ఎంతో గొప్పది. ఇందులో సిలికా అధికంగా ఉంటుంది. సిలికా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. సూక్ష్మక్రీములను నిర్మూలిస్తుందనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
