తిరుపతి ఉప ఎన్నిక : చంద్రబాబు, జగన్ మధ్య నువ్వా నేనా .. నేతలకు సీరియస్ వార్నింగ్ ల మతలబు అదేనా !!
తిరుపతి పార్లమెంటు స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తయారైంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు అధికార వైసీపీకి చావో రేవో అన్నట్లుగా తయారైంది. జగన్ ,చంద్రబాబుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి మరోమారు తిరుపతి ఉప ఎన్నిక వేదిక కానుంది. మెజారిటీ కోసం జగన్, పరువు కోసం చంద్రబాబు చేస్తున్న ఈ యుద్ధం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

క్షేత్ర స్థాయిలో పని చెయ్యాలని చంద్రబాబు సీరియస్ వార్నింగ్
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు పార్టీ శ్రేణులకు క్షేత్రస్థాయిలో పని చేయాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పని చేయకపోతే ఫలితాలు ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లానే ఉంటాయని అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలని, పార్టీ కోసం తెగించి పోరాటం చేసే వాళ్లనే పార్టీ గుర్తిస్తుందని తేల్చిచెప్పారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.

అతి విశ్వాసం మంచిది కాదని చెప్పిన జగన్
ఇదే సమయంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అతి విశ్వాసం మంచిది కాదంటూ పార్టీ నేతలకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నేపథ్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీరియస్ గానే చెప్పారు. చంద్రబాబు పరువు కోసం పాకులాడుతూ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇస్తే కచ్చితంగా అత్యధిక మెజారిటీ తో విజయం సాధించాలని వైసిపి శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి సైతం సీరియస్ గానే చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే మెజారిటీతో దేశం మొత్తం ఒక్కసారిగా తిరుపతి వైపు చూడాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతం కంటే భారీ మెజార్టీ కోసం జగన్ ..పరువు కోసం చంద్రబాబు
గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాదరావు 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. అప్పుడు వైసిపి ప్రతిపక్షంలో ఉంది. కానీ ఇప్పుడు అధికార పార్టీగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని జగన్ భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన వైసిపి తిరుపతి లోక్సభ ఎన్నికల్లో అంతకు మించి చరిత్ర సృష్టించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక పరువు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు.

చంద్రబాబు వర్సెస్ జగన్ ... తిరుపతి ఉపఎన్నికపై ఆసక్తికర చర్చ
వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వైసిపి జగన్ రంగంలోకి దిగకుండానే విజయం సాధిస్తుంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎంపీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎత్తుగడలు రూపొందిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి చుక్కెదురే వచ్చింది. ఇక తిరుపతి ఉప ఎన్నికపై అటు చంద్రబాబు ,ఇటు జగన్ చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications