ఆ నరరూప రాక్షసుడికి ఒకేసారి రెండు శిక్షలు.. పోక్సో కోర్టు సంచలన తీర్పు..
తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేటలో మూడున్నరేళ్ల పసికందుపై జరిగిన అత్యంత దారుణమైన అత్యాచారం, హత్య కేసులో ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘోర కలికి ఒడిగట్టిన నిందితుడు పాముల నాగరాజు అలియాస్ సుశాంత్‌కు న్యాయస్థానం ఊపిరి ఉన్నంత వరకు కఠిన కారాగార శిక్ష (యావజ్జీవ శిక్ష) విధిస్తూ తీర్పునిచ్చింది.
నిందితుడిపై మోపబడిన అత్యాచారం కేసులో ఒక జీవితాంతం కఠిన కారాగార శిక్ష, అలాగే హత్య కేసులోనూ మరో జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు స్పష్టం చేసింది. 'నిందితుడు తన జీవితాంతం, అంటే సహజ మరణం సంభవించే వరకు జైలు కటకటాల వెనుకే ఉండాలి' అని కోర్టు తీర్పులో పేర్కొనడం గమనార్హం. దాంతో పాటు, కడుపుకోత మిగిలిన బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక పరిహారం చెల్లించాలని ప్రభుత్వం, అధికారులను ఆదేశించింది.

నాడు ఏం జరిగింది?..
ఈ అమానుష ఘటన 2024 నవంబర్ 1వ తేదీన వడమాలపేట మండలం ఏఎం పురం ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. మూడున్నరేళ్ల పసికూన సన్విత అలియాస్ చెంచమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా, నిందితుడు నాగరాజు అలియాస్ సుశాంత్ బిస్కెట్లు కొనిస్తానని నమ్మించి పక్కకు తీసుకెళ్లాడు. చిన్నారిని గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ నరకయాతన భరించలేక పాప గట్టిగా ఏడవడంతో, ఎక్కడ తన పాపం బయటపడుతుందోననే భయంతో ఆ పసిగుడ్డు గొంతు నులిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు.
అనంతరం శవాన్ని అక్కడి పొదల్లో పడేసి, ఏమీ తెలియనట్లు సైలెంట్‌గా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో కంగారుపడ్డారు. వెళ్లేముందు పాపతో పాటు సుశాంత్ ఉన్న విషయాన్ని గమనించిన వారు, పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసును పోక్సో, హత్య కేసుగా మార్చి దర్యాప్తును వేగవంతం చేశారు.
నాడు రాజుకున్న రాజకీయ దుమారం.. రోజా తీవ్ర ఆగ్రహం
ఈ ఘటన జరిగిన సమయంలో నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే. రోజా బాధితులకు న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున పోరాటానికి దిగారు. అప్పట్లో ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. "మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను రేప్ చేసి చంపడం అత్యంత దారుణం. ప్రభుత్వ చేతకానితనం వల్లే నేరగాళ్లకు భయం లేకుండా పోతోంది. చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాలి. రాష్ట్రంలో గంజాయి, లిక్కర్, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. జగన్ పై కక్షతో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను వీరు నిర్వీర్యం చేశారు. నిందితుడిని ఉరితీయాలి" అంటూ నాడు రోజా తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు.
హోంమంత్రి అనిత హామీ..
దాడి జరిగిన వెంటనే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా స్పందించి, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ లేదా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి, మూడు నెలల్లోనే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని నాడు ఇచ్చిన మాట ఇచ్చారు. తాజాగా 7 నెలల ట్రయల్స్ తర్వాత ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వడంతో బాధితురాలి కుటుంబంలో ఎట్టకేలకు న్యాయం గెలిచిందనే ఆనందం వ్యక్తమవుతోంది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండటంతో పాటు, నేరగాళ్లకు ఇదొక గట్టి హెచ్చరిక అని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications