తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 63,454 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,882 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.12 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది.
తిరుపతిలో శ్రీ పద్మావతీ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసింది టీటీడీ. ఈ నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ ఆసుపత్రి భవన సముదాయ నిర్మాణ పనులను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మెడికల్ అండ్ ఎడ్యుకేషన్) డాక్టర్ ఏ శరత్ స్వయంగా పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడారు. ప్రతి ఫ్లోర్‌లో ఒక గదిని మోడల్ యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. అందులో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ ఎక్విప్‌మెంట్ తదితర సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని గదుల్లో ఆమోదిత లేఅవుట్‌కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
పెండింగ్ పనులను సంబంధిత విభాగాలు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి గదిలో రోగి సేవలకు అవసరమైన మెడికల్ సపోర్ట్ సదుపాయాలు నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రముఖ ఆసుపత్రులలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై నివేదికలు సేకరించి అమలు చేయాలని సూచించారు. అనంతరం నూతన భవనంలోని ఆరు అంతస్తుల గదులు, పై అంతస్తులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు.












Click it and Unblock the Notifications