తిరుపతి తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఇదే-
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు.
తిరుపతిలోని విష్ణునివాసం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. వారిలో అయిదుమంది మహిళలు ఉన్నారు. 41 మంది గాయపడ్డారు. వాళ్లందరినీ శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), శ్రీవేంకటేశ్వర రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రులకు తరలించారు.

ఈ తొక్కిసలాట ఘటన పట్ల తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక టోకెన్ కౌంటర్ వద్ద భక్తులకు భద్రతను కల్పించదానికి చాలినంత మంది పోలీసులను విధి నిర్వహణలో మోహరింపజేశామని, టీటీడీ, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని వివరించారు.
తొక్కిసలాట చోటు చేసుకున్న కౌంటర్ వద్ద గేట్ తెరిచే విషయంలో మిస్ కమ్యూనికేషన్ ఏర్పడిందని కలెక్టర్ చెప్పారు. సాయంత్రం 7:45 నిమిషాలకు గేట్‌ను సడన్‌గా తెరవాల్సి వచ్చిందని అన్నారు. భక్తుల్లో ఒకరు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆసుపత్రికి తరలించడానికి గేట్ తెరవాల్సి వచ్చిందని, ఆ వెంటనే దాన్ని మూసివేశామని పేర్కొన్నారు.
పలితంగా- టోకెన్లను జారీ చేయడానికి గేట్ తెరిచారని భక్తులు భావించారని, వాళ్లందరూ కూడా గేట్ వైపు దూసుకొచ్చారని చెప్పారు. దీనితో గేట్‌ను తెరవాల్సి వచ్చిందని కలెక్టర్ వివరించారు. రాత్రి 9:15-9:30 గంటలకు పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని, అర్ధరాత్రి 12:30 నుంచి ఒంటిగంట వరకు టికెట్ల జారీ కొనసాగిందని అన్నారు. సకాలంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు.
తొక్కిసలాటలో గాయపడిన ఘటనలో అయిదుమంది మరణించారని, ఒకరు అనారోగ్య కారణంతో చనిపోయినట్లు చెప్పారు. తొక్కిసలాటతో సంబంధం లేదని తెలిపారు. తమిళనాడులోని సేలం నుంచి వచ్చిన భక్తురాలు అనారోగ్యంతో మరణించారని అన్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ముగ్గురు, నర్సీపట్నం, తమిళనాడులోని పొల్లాచ్చికి చెందిన ఒకరు తొక్కిసలాటలో మృతిచెందినట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications