TTD: ధనుర్మాస వేళ శ్రీవారి సేవల్లో మార్పు- దర్శనాల పై కీలక నిర్ణయం..!!
Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం నేడు (డిసెంబరు 16) ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. ఇక, వచ్చే నెల ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం పైన టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుప్పావై నివేదన
నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. తిరుమలలో ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు.
శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు.

వైకుంఠ ద్వార దర్శనం
ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
భక్తులకు సూచనలు
చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేసారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేస్తూ నిర్ణయించారు. భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications