పవన్ కళ్యాణ్ ను సీఎం చెయ్యటమే లక్ష్యంగా.. రంగంలోకి మెగాఫ్యాన్స్; కీలకభేటీ వెనుక ఎవరున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు ఊపందుకుంటున్నాయా? ఇక వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలకుండా చూస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారా? జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, పవన్ కళ్యాణ్ కోసం, జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లడానికి మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

జనసేన కోసం మెగా ఫ్యాన్స్ సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత ఎన్నికలలో తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఇక ఆ ఒకే ఒక స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కూడా పార్టీ కోసం పని చేయని పరిస్థితి నెలకొంది. కానీ రానున్న ఎన్నికలపై ఇప్పటి నుండే జనసేన దృష్టిసారిస్తోంది. ఇక జనసేనకు మద్దతుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు కార్యాచరణ రూపొందించి జనంలోకి జనసేన పార్టీని తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో మురళి ఫార్చ్యూన్ హోటల్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు సమావేశం నిర్వహించారు.

జనసేన కోసం మెగా ఫ్యాన్స్.. కార్యాచరణ రూపొందించనున్న అభిమానులు
అందరూ కలిసి జనసేన పార్టీకి మద్దతుగా నిలిస్తే పార్టీ బలోపేతం అవుతుందని చర్చించారు. ఏ విధంగా జనసేన పార్టీ కోసం మెగా ఫ్యాన్స్ ముందుకు వెళ్లాలి అన్నదానిపై కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో జనసేన పార్టీని జనంలోకి తీసుకు వెళ్లేలా తమ వంతు కృషి చేయాలని, ప్రతి గ్రామంలోనూ అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించినట్లుగా మెగా ఫ్యాన్స్ తెలిపారు. అయితే స్వామినాయుడు ఈ సమావేశం నిర్వహించటం వెనుక ఎవరున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

2024 లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే మెగా ఫ్యాన్స్ లక్ష్యం
2024 లో పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే తమ లక్ష్యమని వారు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ కోసం తాము కష్టపడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం మొదటి సారిగా సమావేశమైన మెగా ఫాన్స్ మరికొన్ని సమావేశాలను నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని ప్రకటించారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ తాము ముందుకు వెళ్తామని మెగా ఫ్యాన్స్ వెల్లడించారు. మెగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలలాగా పని చేస్తారని ప్రకటించారు.

మెగా ఫ్యాన్స్ మీటింగ్ వెనుక ఉన్నది ఎవరో?
ఇక పొత్తుల అంశంపై తమకు ఎలాంటి సంబంధం లేదని, పవన్ కళ్యాణ్ కోసం పని చేయడం మాత్రమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో ప్రజారాజ్యం పై అనేక కుట్రలు చేశారని, అయినప్పటికీ చిరంజీవి కోసం తాము పనిచేశామని వెల్లడించారు. ఇక ప్రస్తుతం జనసేన పైన కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం తాము కలిసికట్టుగా పని చేస్తామని మెగా అభిమానులు వెల్లడించారు. అయితే ఇది అభిమానులు తీసుకున్న నిర్ణయమా? లేక చిరంజీవి ఆదేశాలతోనే మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగుతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారిన అంశం.












Click it and Unblock the Notifications