Mohan Babu: మోహన్ బాబు అరెస్టుపై తేల్చేసిన హైకోర్టు..! కీలక ఆదేశం..!
ఏపీలోని చిత్తూరు జిల్లాలో మోహన్ బాబు యూనివర్సిటీని నడుపుతున్న టాలీవుడ్ నటుడు మోహన్ బాబు (mohan babu)కు ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన యూనివర్శిటీ వద్ద ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న విద్యార్ధి సంఘాల నేతల్ని కిడ్నాప్ చేయించి హింసించిన కేసులో ఆయనకు హైకోర్టులో బిగ్ షాక్ తప్పలేదు. ఈ మేరకు మోహన్ బాబు దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు ఇవాళ తోసిపుచ్చింది.
గత నెలలో తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ విద్యార్ధుల ఫీజుల విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తోందంటూ నిరసనలు చేపట్టారు. దీంతో వారిని మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయినా వారిని విడిచి పెట్టలేదు. చివరికి బయటి వ్యక్తుల జోక్యంతో ఆయా విద్యార్ధి నేతల్ని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

దీనిపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మోహన్ బాబు తన యూనివర్శిటీ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్ధి నేతల్ని కిడ్నాప్ చేయించారన్న అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకోసం మోహన్ బాబు స్వయంగా తన పీఆర్వో సతీష్ కు ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అలాగే మెసేజ్ కూడా పెట్టారు. దీనిపై తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్న వేళ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి.. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. దీనిపై లోతైన విచారణ జరపాలని నిర్ణయించి కేసు విచారణను మార్చి 3కు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications