ఆస్పత్రిపాలైన కమెడియన్ పృథ్వీ-వైసీపీ టార్చర్ తట్టుకోలేక..!
టాలీవుడ్ కమెడియన్, ధర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో పాపులర్ అయిన పృధ్వీరాజ్ ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
ఆయనకు డాక్టర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా లైలా చిత్రం ఫంక్షన్లో వైసీపీని ఉద్దేశించి పృథ్వీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పటి నుంచి వీటిపై వైసీపీ సోషల్ మీడియా టార్చర్ ఎక్కువ కావడంతో పృధ్వీరాజ్ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.

గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పృధ్వీరాజ్ కు ఆ తర్వాత జగన్ ఎస్వీబీసీ ఛైర్మన్ పోస్టు ఇచ్చారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు. దీంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన ఆయన.. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. కూటమి తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పృథ్వీకి ఎలాంటి పదవులూ రాలేదు.
అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన లైలా చిత్ర ఫంక్షన్ కు హాజరైన పృథ్వీ.. వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో 150 మేకలు ఉండేవని, తర్వాత చూస్తే 11 అయిపోయాయంటూ సెటైర్లు వేశారు. ఇవి కాస్తా వైరల్ కావడంతో వైసీపీ సోషల్ మీడియా పృధ్వీరాజ్ పై విరుచుకుపడింది. సోషల్ మీడియాలో పృథ్వీని టార్గెట్ చేస్తూ వందల సంఖ్యలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఇదే క్రమంలో పృధ్వీరాజ్ కు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కాల్స్ కూడా చేసి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications