జగన్ సర్కార్‌ను కూలదోసే కుట్ర: చంద్రబాబుకు కొందరు సినీ పెద్దల అండ: రాజకీయాల్లోకి ఆ నిర్మాత
అమరావతి: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్.. త్వరలోనే రాజకీయాల్లో ప్రవేశించనున్నారు. ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు. వైఎస్ జగన్ ఆదేశిస్తే..తాను ఎన్నికల్లో పోటీ చేయడానికీ సంసిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించినట్టయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైనట్టేనని, చేరికకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని తెలుస్తోంది.

సినిమా టికెట్ల రేట్ల వివాదంలో..
నట్టి కుమార్‌కు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా పేరుంది. సినిమా టికెట్ల ధరల నియంత్రణ విషయంలో ఆయన జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. తన మద్దతును తెలిపారు. టికెట్ల రేట్లను తగ్గించడాన్ని స్వాగతించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన బాహటంగా సమర్థించారు. సినిమాలను తీయడంలో చిన్న, పెద్ద అంటూ తేడా ఏదీ ఉండదని, అన్నింటికీ ఒకే టికెట్ల ధర ఉండాలనే అంశాన్ని తాను సమర్థిస్తున్నాననీ అన్నారు.

జగన్ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ..
తాజాగా- ఆయన విలేకరుల ముందుకొచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వివరించారు. త్వరలోనే తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లు చెప్పారు. ఏ పార్టీలో.. ఎప్పుడు చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తాననీ అన్నారు. టికెట్ దక్కకపోయినప్పటికీ తాను నిరాశ చెందనని, జగన్ పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని నట్టి కుమార్ స్పష్టం చేశారు.

పడగొట్టే కుట్ర..
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ ఉందని నట్టి కుమార్ పేర్కొన్నారు. ఆ ఆదరణను చూసి ఓర్వలేకపోతున్న కొందరు జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. దీనికోసం అనేక కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. దీని వెనుక కొంతమంది అధికారులు కూడా ఉన్నారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో పని చేస్తోన్నకొందరు అధికారులు తెలుగుదేశం పార్టీ అధినేతే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

2034 వరకు ఆయనే సీఎం..
చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు, రాజకీయ నాయకులు కలిసి కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. అందుకే వారి ప్రయత్నాలను అడ్డుకోవడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు నట్టి కుమార్ అన్నారు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు పన్నినప్పటికీ.. 2034 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉంటారని తేల్చి చెప్పారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా మరొకరు ఉంటారనే విషయాన్ని మర్చిపోవచ్చని అన్నారు.
Recommended Video

ఫిబ్రవరి 1న చేరే ఛాన్స్..
వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయని, అవి ఎప్పుడూ అలాగే ఉంటాయని నట్టి కుమార్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనలు, చేసిన మంచి పనులు వైఎస్ జగన్ వెంట ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2019, ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్ జగన్‌కే ఓటు వేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం ఉంది.












Click it and Unblock the Notifications