
చిరంజీవి పై జగన్ కు సోదర భావం -ఆన్ లైన్ టిక్కెట్లకు ఇండస్ట్రీ ఓకే : ధరలు సవరించాలి- మంత్రి నాని హామీ..!!
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ టిక్కెట్ల విధానానికి సినీ పెద్దలు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో కొన్ని సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా చిరంజీవి ఒక సినిమా ఈవెంట్ లో ప్రస్తావించిన అంశాల పైనా చర్చ జరిగింది. సినీ పరిశ్రమ ప్రభుత్వం నుంచి ఏం కోరురకుంటుందనే అంశాలను నిర్మాతలు ప్రభుత్వానికి వివరించారు. ఆన్ లైన్ టిక్కెట్లతో పాటుగా సినీ ఇండస్ట్రీ సమస్యల పైన ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. సినీ ప్రముఖులు డివివి దానయ్య, సి కళ్యాణ్, అదిశేషగిరావు, దిల్ రాజు,అలంకార్ ప్రసాద్ తో పాటుగా 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి పేర్ని నాని.. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారికి ప్రభుత్వ నిర్ణయం గురించి వివరించారు. వారి నుంచి సూచనలు స్వీకరించారు. అయితే, ప్రేక్షకుడికి నష్టం లేకుండా.. ప్రభుత్వ పరంగా చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిరంజీవి అంటే ముఖ్యమంత్రికి గౌరమని..మెగాస్టార్ ను సీఎం సోదర భావంతోనే చూస్తారని మంత్రి నాని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనల పైన ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. త్వరలో సినీ ఛాంబర్స్ ప్రతినిధులతో మరో సమావేశం ఉంటుందన్నారు.

ఈ ఆన్ లైన్ విధానం పైన ముందుకే వెళ్తామని మంత్రి తేల్చి చెప్పారు. ఇక, ప్రభుత్వ ప్రతిపాదన పైన నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయం చేయడం వల్ల ఇబ్బందేమీ లేదని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ చెప్పారు. ఇప్పుడు బుక్ మై షోల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు.. ఇకపై ప్రభుత్వ వెబ్ సైటులోకి వెళ్లి బుక్ చేసుకుంటారని వ్యాఖ్యానించారు. టిక్కెట్ల ధరల పెంపుపై చర్చ జరగలేదన్నారు. థియేటర్ల మెయిన్టెనెన్స్ విషయంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు.
అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ విధానం ఉందని.. ఏపీ లో కూడా అమలు జరపాలని కోరామని నిర్మాత ఆదిశేషగిరి రావు చెప్పారు. సినిమా టికెట్ రేట్లు సవరించాలని తాము అడిగామన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలితాన్నిస్తాయని మరో నిర్మాత సీ కళ్యాణ్ చెప్పారు. మా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆక్సిజన్ ఇచ్చారన్నారు.
అతి త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారని..సీఎం జగన్ మంచి భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ కావాలని తామే అడిగామని కళ్యాణ్ స్పష్టం చేసారు. అన్ని సినిమా సమస్యలపై మంత్రి పేర్ని నాని బాగా స్పందించారని అభినందించారు. తెలుగు సినిమా అన్ని సెక్టార్ మరియు 24 క్రాఫ్ట్ కు సంబంధించి మంచి హామీ ఇచ్చారని కళ్యాణ్ వివరించారు. దీంతో..వచ్చే వారం సినీ ప్రముఖులతో ప్రభుత్వం మరో విడత చర్చలకు నిర్ణంచినట్లు సమాచారం.