YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టులో తాత్కాలిక ఊరట..షరతులివే..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సీబీఐ విచారణ పేరుతో తనను వేధిస్తోందని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇవాళ రెండోరోజు కూడా సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆయన విజ్ఞప్తిని మన్నించింది. అవినాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. వీటిని అమలు చేస్తూ ముందస్తు బెయిల్ తీసుకోవాలని ఆదేశించింది.

వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ప్రతీ రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతు విధించింది. ఈ నెల 25 వరకూ ఇలా విచారణకు హాజరు కావాలని సూచించింది. అలాగే ఈ నెల 25 వరకూ ఆయన్ను అరెస్టు చేయకుండా సీబీఐని ఆదేశించింది. ఈ నెల 25న ఈ కేసులో తుది తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించాలనే షరతు కూడా విధించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.

మరోవైపు అవినాష్ కు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో సీబీఐ తరఫున విచారణాధికారి కోర్టుకు హాజరయ్యారు. దీంతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన విచారణను రేపు ఉదయం పదిన్నరకు వాయిదా వేస్తున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. ముందస్తు బెయిల్ ఇచ్చినందున రేపటి నుంచి రెగ్యులర్ గా విచారణకు హాజరయ్యేలా చూడాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని మన్నించిన హైకోర్టు.. ఆ మేరకు పిటిషనర్ అవినాష్ కు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications