మోస పోవద్దని కోరిన టీటీడీ- కఠిన చర్యలకు ఆదేశాలు: టోల్ ఫ్రీ, విజిలెన్స్ ఫోన్ నంబర్లు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 70,472 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,247 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.85 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తొమ్మిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం పట్టింది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఇటీవలే ఊర్వశి అనే భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించారు. అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడినని తప్పుడు సమాచారంతో పరిచయం చేసుకున్నాడు.

సదరు భక్తురాలికి వసతి కల్పిస్తామని నమ్మబలికి కొంత మొత్తాన్ని వసూలు చేశాడు. డబ్బు చెల్లిస్తే వసతి టికెట్ ను పీడీఎఫ్ పంపిస్తామని హామీ ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత అభిమాన్యు తన ఫోన్ కాల్స్, వాట్సాప్ మేసేజ్ లకు స్పందించకుండా మోసం చేశాడు. దీంతో నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసపోయానని గ్రహించిన ఆ భక్తురాలు 1930 క్రైమ్ హెల్ప్ లైన్ కు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దర్శనం, వసతి గదులు, ఇతర సేవల పేరుతో నకిలీ వెబ్ సైట్లు ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలు అధికం అయ్యాయని, ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. భక్తులను అనుమాస్పద వ్యక్తులు, దళారులు ప్రలోభ పెడితే ముందుగా టీటీడీ విజిలెన్స్ విభాగం నంబర్ 0877- 2263828 ఫోన్ చేయాలని, అనుమానాలను నివృత్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నకిలీ దర్శన టికెట్లు, వసతి పేరుతో దందా చేస్తే వెంటనే ఆ విషయాన్ని వెంటనే విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని కోరింది.
శ్రీవారి దర్శనం, వసతి కోసం టిటిడి అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams mobile app ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని భక్తులకు సూచించింది. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని టీటీడీ కోరింది.
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో నేటి నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, వాస్తు పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.పవిత్రోత్సవాల్లో భాగంగా నేడు పవిత్రప్రతిష్ఠ, 6న పవిత్ర సమర్పణ, 7న మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications