TTD: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం- ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది. డిసెంబర్ 30,31, జనవరి 1 తేదీల్లో తిరుమలలో రద్దీ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో టీటీడీ, ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. దశల వారీగా ఈ నిర్ణయం అమలు చేయనున్నారు.
తిరుమల క్షేత్రాన్ని సంపూర్ణ కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని టీటీడీ, ప్రభుత్వం డిసైడ్ అయ్యాయి. ఇందు కోసం కార్యాచరణ ఖరారు చేసారు. తిరుమలలో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ మయం చేయాలన్న లక్ష్యంతో ఆర్టీసీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన సంవత్సరంలో తిరుపతి, తిరుమలకు అదనపు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రస్తుతం 64 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా కడప, నెల్లూరు, మదన పల్లె మార్గాల్లో మరో 36 బస్సులు నడుస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మరో 50 బస్సులకు ఆర్టీసీ టెండర్లు ఖరారు చేసింది. 'ఈకా' సంస్థ ఈ బస్సులను సరఫరా చేయనుం డగా రానున్న 3 లేదా 6 నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
కాగా, ఇవి కాకుండా తిరుమలకు ప్రత్యేకంగా మరో 300 బస్సులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో అందుకు ఆమోదం లభించింది. వాటికి సంబంధించి న రూట్‌మ్యాప్, ప్రతిపాదనల ప్రక్రియ 95 శాతం పూర్తయిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ధరలు, నిర్వహణ వ్యయం అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వమే నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. పీఎం ఈ-సేవ కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వివరాలు సేకరించి కేంద్రమే టెండర్లు పిలుస్తుండటంతో తక్కువ ధరకే బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 11 నగరాల్లో తిరుపతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 323 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ఈవీ పాలసీ ప్రకారం 2029 నాటికి డీజిల్ బస్సులన్నింటినీ తొలగించి, నూటికి నూరు శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications