TTD:నేడే చివరి సమావేశం, భూమన బాధ్యతలు - కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి..!!
Tirumala: టీటీడీ పాలకమండలి సమావేశం ఈ రోజు సమావేశం కానుంది. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే ఆఖరి సమావేశం ఇదే. పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోనున్నారు. నూతన ఛైర్మన్ గా నియమితులైన భూమన కరుణాకర రెడ్డి ఈ నెల 10న బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త ఏర్పాటయ్యే పాలక మండలిలో సభ్యులుగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
టీటీడీ పాలక మండలి సమావేశం:వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షత న తిరుమలలో ఈరోజు (ఆగస్టు 7) ప్రస్తుత పాలక మండలి సమావేశం జరగనుంది. సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 8 తో ముగుస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 29 మంది సభ్యులు ఉన్న పాలకమండలి ఆఖరి సమావేశంగా భేటీ కానుంది. పలు కీలక తీర్మానాలపై చర్చించనుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి వరుసగా రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ సమావేశంలో ఈ నాలుగేళ్ల కాలంలో టీటీడీలో తీసుకున్న నిర్ణయాల పైన సుబ్బారెడ్డి గుర్తు చేసే అవకాశం ఉంది. అదే విధంగా బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్దం అవుతున్న సమయంలో మరిన్ని నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు.

10న కరుణాకర రెడ్డి ప్రమాణ స్వీకారం:టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. ఇప్పటికే 2004 నుంచి 2006 వరకు పాలక మండలి సభ్యుడుగా, 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా కొనసాగిన భూమన ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే గా టిటిడి బోర్డులో స్పెషల్ ఇన్వైటీ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్ గా రెండోసారి శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కించుకున్నారు.
టిటిడి పట్ల పూర్తి అవగాహన ఉందంటున్న భూమన టిటిడి చైర్మన్ గా హిందూ ధార్మిక వ్యాప్తి కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కొత్త చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈ నెల 10 న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.44 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి వద్ద చైర్మన్ గా రెండోసారి భూమన శ్రీవారి ప్రథమ సేవకుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.
బోర్డు సభ్యులుగా ఛాన్స్ ఎవరికి:టీటీడీకి నూతన ఛైర్మన్ ఖరారు కావటంతో ఇప్పుడు బోర్డు సభ్యుల ఎంపికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీతో పాటుగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారికి బోర్డులో అవకాశం దక్కనుంది. ఎన్నికల సమయం కావటంతో బోర్డు సభ్యులుగా సీఎం జగన్ ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే బోర్డు కూర్పు పైన సీఎం జగన్ కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఛైర్మన్ విషయంలో అనూహ్యంగా చివరి నిమిషంలో భూమనను ఎంపిక చేసిన సీఎం జగన్..ఇప్పుడు బోర్డు సభ్యుల విషయంలోనూ అదే తరహాలో నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, ఆశావాహులు సీఎం జగన్ నిర్ణయం కోసం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications