టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి తీవ్ర ఆగ్రహం
TTD Chairman BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానంపై భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు పెట్టాయి. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలను టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
రెండు రోజుల కిందటే తిరుమలను సందర్శించారు శ్రీనివాస్ గౌడ్. శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనం విషయంలో టీటీడీ వివక్షను ప్రదర్శిస్తోందని, తెలంగాణ వారి పట్ల చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే తెలంగాణకు చెందిన సామాన్య భక్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారుల పట్ల వివక్ష చూపుతున్నారని, ఇది మంచి పరిణామం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీటీడీ పాలక మండలి అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, శ్రీవేంకటేశ్వరుడు ఈ సమస్త ప్రపంచానికే దేవదేవుడని, ఆయన వెలిసిన తిరుమలలో ఏపీలో ఉన్నంత మాత్రాన ఇతర ప్రాంతాల వారి పట్ల వ్యత్యాసం చూపడం సరికాదని అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేనని, తెలంగాణ- ఏపీ వారికి సమాన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలని, దీన్ని సరి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యాఖ్యల పట్ల టీటీడీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లడకూడదంటూ తొలి పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశామని, తెలంగాణకు చెందిన నేత దీన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తోన్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తేల్చి చెప్పారు.
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్ర క్షేత్రమని, ఇది రాజకీయ వేదిక కాదని హితవు పలికారు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు.
తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదని పాలకమండలి తొలి సమావేశంలోనే నిర్ణయించామని, దీన్ని ప్రత్యేక అజెండాగా చేర్చి మరీ ఈ నిర్ణయాలను తీసుకున్నామని, తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీపడబోమని బీఆర్ నాయుడు అన్నారు.
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్లు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని అన్నారు. తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications