అలిపిరి టోల్ గేట్ వద్ద ఇకపై అవి తప్పనిసరి..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 78,466 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,722 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.52 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
కాగా- తిరుమలలో మందుబాబుల ఆగడాలను అరికట్టడానికి టీటీడీ రంగంలోకి దిగింది. బ్రీత్ అనలైజర్లను వినియోగించనుంది. దీనికోసం 20 బ్రీత్ అనలైజర్లను తిరుపతి జిల్లా పోలీసులకు అందజేసింది. మొత్తం ఎనిమిది లక్షల వ్యయంతో కొనుగోలు వీటిని కొనుగోలు చేసింది. తిరుమల, తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి టోల్ గేట్ వద్ద వీటిని వినియోగిస్తారు. భక్తుల భద్రత చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టామని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుపతిలోని టీటీడీ అడ్మిన్ భవనంలో ఈ బ్రీత్ అనలైజర్లను జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఇందులో భాగంగా పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించడానికి సిద్ధమని తెలిపారు. అనంతరం సుబ్బారాయుడు.. ఈ బ్రీత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు.
మొత్తం 20 పరికరాల్లో తిరుమల, అలిపిరి టోల్ గేట్ వద్ద నాలుగింటిని వినియోగిస్తారు. మిగిలిన 12 బ్రీత్ అనలైజర్లను తిరుపతిలో వివిధ ప్రధాన మార్గాలు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వాడుతారు. డ్రంకన్ డ్రైవ్ లను అరికట్టి ప్రమాదాలు తగ్గించడంలో బ్రీత్ అనలైజర్లు తోడ్పడతాయని సుబ్బరాయుడు అన్నారు. మద్యం సేవించి ఘాట్ రోడ్లపై వాహనాలను నడిపితే సహించేది లేదని, వారి వాహనాల సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications