శ్రీవారి సేవల్లో భారీ మార్పులు- ఎన్నారైలకూ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో క్రిక్కిరిసిపోతోంది. శుక్రవారం నాడు 74,374 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,477 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.02 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

శ్రీవారి సేవలను విశ్వవ్యాప్తం చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం 14 దేశాలకు చెందిన వివిధ రంగాల ఎన్నారై ప్రతినిధులతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ వర్చువల్ సమావేశంలో జర్మనీ- సూర్యప్రకాశ్, ఐర్లాండ్- డాక్టర్ శివశంకర్, సంతోష్ పల్లె, రమేశ్ గుమ్మడవల్లి, యూకే- లోకనాథం, విజయ్ కుమార్, అరుణ్ ముమ్మలనేని, శివరాం రెడ్డి, విజయ్ కుమార్, డాక్టర్ అనిల్ కుమార్, రీతు, నెదర్లాండ్- శివరాం, ఫ్రాన్స్- కన్నెవిరనె పాల్గొన్నారు.
పోలెండ్- సంతోష్, చంద్ర అక్కల, స్వీడన్- రమణ కుమార్ రంగా, స్విట్జర్లాండ్- అమర్ కవి, అమెరికా- రఘువీర్ బండార్, హర్షిత, అమరనాథ్, డెన్మార్క్- రామ్ దాస్, మారిషష్, శ్రీలంక- విక్కీ తురాయ్జా, దుబాయ్- విక్రమ్ ఇందులో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ- కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలు రాష్ట్రాల నుంచి శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా తిరుమలకు వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారని అన్నారు.
త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్నారైలు కూడా తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారని శ్యామలరావు చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారని, వారి సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోన్నామని అన్నారు.
ఇప్పటికే అమెరికా తదితర దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు విరివిగా నిర్వహించేందుకు వారు సహకరిస్తున్నారని, తాజాగా శ్రీవారి సేవలో తీసుకువస్తున్న సంస్కరణల మూలంగా వైద్యం, ఐటీ, ఇంజినీరింగ్, ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలలో సేవలు అందించడానికి ఎన్నారైలు ముందుకు వస్తున్నారని చెప్పారు.
ఎన్నారైల నైపుణ్యం ఆధారంగా వారి సేవలను టీటీడీలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు తయారు చేయాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శ్రీవారి సేవల్లో తమకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించడం పట్ల ఎన్నారైలు.. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications