TTD: తిరుమల లో మరో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి భక్తులు ఇక నుంచి..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలా తోరణం వరకు భక్తులు క్యూలైన్ లో వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 89,403 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా, తిరుమలలో భక్తుల కోసం మరో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం పైన టీటీడీ ప్రత్యేకంగా కసరత్తు మొదలు పెట్టింది. క్యూ లైన్లకు మాత్రమే కాకుండా.. కొత్త సదుపాయాల తో నిర్మాణం దిశగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూ లైన్లను పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో వెసులుబాటు భక్తులకు కల్పించారు. టీటీడీ భక్తులకు తాత్కాలికంగా క్యూ లైన్ల నుండి బయటకు వెళ్లే అవకాశాన్ని కల్పించింది. భక్తులు తిరిగి దర్శనానికి రెండు గంటల ముందు లైన్లలో చేరవచ్చు. ఇందు కోసం టోకెన్లను జారీ చేస్తున్నారు. అదే విధంగా భక్తుల రద్దీని, క్యూ లైన్ల నిర్వహణను 'ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్' ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనిద్వారా సర్వదర్శనం భక్తులకు వేగంగా దర్శనం అందేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కొత్తగా శ్రీవారి అభిషేక సేవలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ.. శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా దాదాపు 5 వేల మంది సర్వదర్శన భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు.

పెరుగుతున్న రద్దీ వేళ కీలక నిర్ణయాలు
ఇక, కొత్త భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం దిశగా కసరత్తు చేస్తున్నారు. గతంలోనే ఈ తరహా నిర్మాణం కోసం ఆమోదం లభించింది. రద్దీ రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 , 2 తో పాటుగా నారాయణగిరి రోడ్డులోని షెడ్లు నిండిపోతున్నాయి. శిలాతోరణం, గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. దీంతో.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణం పైన చదలవాడ క్రిష్ణమూర్తి ఛైర్మన్ గా ఉన్న సమయంలోనే నిర్ణయం జరిగింది. అయితే, స్థానికంగా వచ్చిన ఇబ్బందుల కారణంగా ప్రతిపాదన స్థాయిలోనే నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స -3 నిర్మాణం పైన ప్రముఖ సంస్థ నుంచి ప్రాజెక్టు రిపోర్టు సేకరిస్తున్నారు. అవసరమైన నిర్ణయాలను అమలు చేస్తూ.. నిర్మాణం దిశగా కసరత్తు జరుగుతోంది. వచ్చే బోర్డు సమావేశంలో ఈ కొత్తగా వైకుంఠం క్యూ కాంప్లెక్స -3 నిర్మాణం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications