శ్రీవారి భక్తులకు శుభవార్త.. అక్కడ కూడా టికెట్ కౌంటర్ ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు శుభవార్త చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిత్యం వందల సంఖ్యలో భక్తులు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వీటిని జారీచేసేందుకు తిరుమల ఈవో శ్యామలరావు కొన్ని స్థలాలను పరిశీలించి చివరకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు ఉండటానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్లు జారీచేసే కౌంటర్లతోపాటు భక్తులు వేచివుండేందుకు అవసరమైన సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు.
కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
సామాన్య భక్తులకు ఇకనుంచి మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ప్రతిరోజు ఇచ్చే వెయ్యి శ్రీవాణి టికెట్లలో 750 టికెట్లను ఆన్ లైన్ లో ఇస్తారు. విడిగా మిగతా 250 టికెట్లు ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే 500 టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది. శ్రీవాణి టికెట్లను గతంలో మాధవం విశ్రాంతి గృహంలో ఇచ్చేవారు. ప్రస్తుతం ఇక్కడ ఇవ్వడాన్ని నిలిపివేశారు. వీరికి రేణిగుంట విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. అక్కడ శ్రీవాణి టికెట్లు పొందాలనుకునే భక్తులు బ్రేక్ దర్శనానికి బోరింగ్ పాస్ ను జతపరచాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టికెట్ తోపాటు బోర్డింగ్ పాస్ ను కూడా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించనున్నారు.

సేవ చేసుకోవాలనుకునేవారు
జనవరి 11వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 25 తిరుప్పావడ ఆర్జిత సేవ టికెట్లను ఇవ్వనున్నారు. ఎందుకంటే ఈ సేవను జనవరి 12వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నారు. తిరుమల సీపీఆర్వో కౌంటర్లలో పేరు నమోదు చేసుకున్నవారికి టికెట్లు జారీచేయనున్నారు. స్వామివారికి సేవ చేసుకోవాలనుకునేవారికి శనివారం ఉదయం 11.00 గంటల నుంచి కోటా అందుబాటులో ఉంచనున్నారు. 12.00 గంటలకు నవనీత సేవ, ఒంటిగంటకు పరకామణి సేవను ఆన్ లైన్ లో విడుదల చేశారు. సేవ చేసుకునేవారికి ఉచితంగానే వసతితోపాటు దర్శనం కూడా కల్పిస్తారు.












Click it and Unblock the Notifications