తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం
గత వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)ని పొలిటికల్ చేశారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆదివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
పవిత్ర క్షేత్రం తిరుమలలో గత 5 ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని గుర్తుచేశారు. తనకు వ్యక్తి గతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని చంద్రబాబు చెప్పారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి చేసిన అద్భుతమే తప్ప, ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమన్నారు.

తిరుమల స్వామి వారు అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్యమని చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో భక్తుల మనోభావాలకు విలువలేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు వినియోగించారన్నారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. వైసీపీ ప్రభుత్వం శ్రీవారిని కూడా వదల్లేదని మండిపడ్డారు.
ఎంతో విశిష్టత కలిగిన లడ్డూ తయారీకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. నాసిరకం వారికి గేట్లు తెరిచినట్లుగా రివర్స్ టెండరింగ్ నిబంధనలు మార్చేశారన్నారు. ఫలితంగా ప్రధాన సంస్థలు ఏవీ టెండర్లలో పాల్గొనలేకపోయాయి. రూ. 320కి కిలో ఆవు నెయ్యి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వీఐపీ టికెట్లు అమ్ముకోవడం సహా కొండపై వ్యాపారాలు చేశారన్నారు. అన్యమతస్తులను టీటీడీ ఛైర్మన్‌గా చేశారు. తప్పు చేసిన అందరి అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామిరు సెటిల్ చేస్తారని, అది ఆయన మహత్య్మం అని రాజేశం వ్యాఖ్యానించారు.
ఇక, తిరుమల ప్రక్షాళనకు దేవుడు తనకొక అవకాశం ఇచ్చారని, శ్యామలరావుకి చెప్పి, అందుకనుగుణంగా పనిచేయాలని ఈవోగా నియమించినట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతమై అనుమానంతోనే 4 ట్యాంకర్లలో నెయ్యి శాంపిల్స్ ని ఎన్‌డీడీకి పంపామని.. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత ఎస్ వేల్యూల్లో భారీ వ్యత్యాసాలు వెలుగుచూశాయని చెప్పారు. వెంటనే ఈవో సదరు సంస్థలకు నోటీసులు ఇచ్చి, బ్లాక్ లిస్టులోపెట్టారని.. తదుపరి చర్యలకు నిపుణుల కమిటీ కూడా వేసి మళ్లీ టెండర్లు పిలిచారన్నారు. అంతేగాక అక్రమాలపై ఐజీ, ఆపైస్థాయి అధికారితో అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని, సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
శాంతి పూజ
రేపు(సోమవారం) తిరుమలలో శాంతి హోమం చేస్తామని చంద్రబాబు తెలిపారు. సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు హోమం, పంచగవ్యప్రోక్షణ చేస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు. అదే విధంగా దేవాదాయ శాఖ తరఫున అన్ని దేవాలయాల్లోనూ హోమాలు చేయటంతో పాటు నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఆయా ప్రార్ధనా మందిరాల్లో ఆ మతం వారే బాధ్యతలు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతసామరస్యం కాపాడేందుకు అవసరమైతే ఓ ప్రత్యేక చట్టం కూడా తెస్తామన్నారు. ఆగమ శాస్త్ర పండితులు, ఇతర నిపుణులతో ఓ ప్రత్యేక కమిటీ వేసి సంప్రదాయాలు కాపాడే దిశగా సిఫార్సులు కోరి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications