TTD: శ్రీవారి భక్తులకు కొత్త ఏడాది కానుక..!!
Tirumala: తిరుమల అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు వేగంగా దర్శనం జరిగేలా బోర్డు కొత్త నిర్ణయాల పైన కసరత్తు చేస్తోంది. ఏఐ వినియోగించాలని భావిస్తోంది. వచ్చే నెలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ వెల్లడించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం వేళ టీటీడీ భక్తులకు కీలక సమాచారం అందించింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ కొత్త సంవత్సరం వేళ కీలక ప్రకటన చేసింది. ప్రతీ ఏడాది ప్రారంభానికి ముందే టీటీడీ భక్తులకు క్యాలెండర్లు, డైరీలు అందుబాటులోకి తీసుకొస్తోంది. మరో పది రోజుల్లో 2025 కొత్త ఏడాది ప్రారంభం కానుంది. దీంతో, తిరుమలలో ప్రత్యేక పర్వదినాలు .. పండుగలు.. పంచాంగ వివరాలతో రూపొందించిన క్యాలెండర్లను భక్తుల కోసం సిద్దం చేసినట్లు టీటీడీ ప్రకటన చేసింది. ప్రతీ ఏటా ఈ క్యాలెండర్లు, డైరీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

క్యాలెండర్లు, డైరీలు పొందాలనుకునే భక్తులు టీటీడీ ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్, సింగల్ షీట్ క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ఆన్ లైన్ తో పాటుగా తిరుమల, తిరుపతి, తిరుచానూరు తో పాటు హైదరా బాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు లో విక్రయం చేయాలని నిర్ణయించారు. డైరీలు, క్యాలెండర్ల ధరలను టీటీడీ ఖరారు చేసింది.
పెద్ద డైరీలు రూ. 150, చిన్న డైరీ రూ.120, 12షీట్ల క్యాలండర్ రూ. 130, టేబుల్ టాప్ క్యాలండర్ ఒకటి రూ. 75 ధరలుగా నిర్ణయించినట్లు సమాచారం. డోర్ డెలివరీ సౌకర్యం సైతం అందుబాటులో ఉందని టీటీడీ వెల్లడించింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించిన సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications