రేపే టీటీడీ మహా దీపోత్సవం- భక్తులకు కానుకలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 73,179 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,602 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.03 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచివున్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీరు, పాలు అందజేశారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ- హిందూ ధార్మిక పరిషత్ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కార్తీక మహా దీపోత్సవం, శ్రీ మహాలక్ష్మి పూజను నిర్వహించనున్నాయి. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానం దీనికి వేదిక. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తోన్నారు.
మహా దీపోత్సవంలోభాగంగా మహిళలు దీపాలను వెలిగించడానికి వీలుగా దీపపు దిమ్మెలను ఏర్పాటు చేస్తోన్నారు. నేతి వత్తులను అందుబాటులో ఉంచనున్నారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం తివాచీలు పరచనున్నారు. అలాగే- ఒక్కో దీపపు దిమ్మె వద్ద ఒక తులసి మొక్కను ఉంచనున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకూ ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం తులసీ మొక్కను కానుకగా అందిస్తారు.
ఈ కార్యక్రమం కోసం టీటీడీ పరిపాలనా భవనం ముస్తాబవుతోంది. ప్రధాన ద్వారాల మొదలుకుని ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని, ఈ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు లైవ్ టెలికాస్ట్ ఇస్తుంది.












Click it and Unblock the Notifications