తిరుమలలో వసతి గదులు కావాలంటే, TTD కీలక మార్పులు - ఇక నుంచి కేటాయింపు ఇలా..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో భక్తులకు వసతి కేటాయింపు విధానం టీటీడీ కీలక మార్పులు చేసింది. భక్తులకు నిరీక్షణ అవసరం లేకుండా నూతన విధానం అమల్లోకి తెచ్చింది. గదుల కేటాయింపు విధానం సులభతరం చేసింది. ఇక నుంచి వేగంగా గదుల కేటాయింపు అమలు చేసేలా మార్పులు తీసుకొచ్చింది.
తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి కష్టాలు తీర్చేందుకు టీటీడీ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం వసతి కోరుకునే భక్తుడు మందుగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గదులు అందుబాటులో ఉన్నంత వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పాటు, ఫోన్ నంబర్‌ను అక్కడి కౌంటర్‌లో అందించాలి. అనంతరం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. ఈ సమయంలో భక్తులు తమకు కావాల్సిన గది కేటగిరీని ఎంచుకోవచ్చు. కేటగిరీల వారీగా అద్దు రుసుము ఖరారు చేస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన భక్తులకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు.

సులభంగా గదులు పొందే అవకాశం
సీఆర్వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ ప్లే బోర్డుల పైన రిజిస్ట్రేషన్ క్రమ సంఖ్యల వారీగా గదులు కేటాయించబడుతున్న సమాచారం ప్రదర్శిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్ డిస్ ప్లే అయిన 15 నిమిషాల్లోపే, వారు నమోదు చేసిన ఫోన్ నంబర్‌కు గది కేటాయింపునకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. సమాచారం వచ్చిన తరువాత భక్తులు నేరుగా తమకు గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్ పద్ధతిలో డిపాజిట్ చెల్లించాలి. వెంటనే వారికి గది తాళాలు అందజేస్తారు. ఉప విచారణ కార్యాలయాల వివరాలను టీటీడీ వెల్లడించింది. గది పొందడానికి భక్తుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఒంటరి వ్యక్తులకు, అవివాహితులకు గదులు కేటాయించరు. ఒకసారి గది పొందిన వ్యక్తి, తిరిగి 30 రోజుల వరకు మరో సారి గది పొందే అవకాశం ఉండదు.













Click it and Unblock the Notifications