TTD: శ్రీవారి భక్తులకు శాశ్వత ఐడీ - దర్శనం, వసతి, సేవల్లో కొత్త విధానం..!!
Tirumala: తిరుమలలో భక్తులకు సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే లా కసరత్తు జరుగుతోంది. గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ద్వారా దర్శనం.. వసతి తో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు.
గుగూల్ తో ఒప్పందం
తిరుమలలో భక్తులకు సాంకేతికత వినియోగించి సేవలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యత గా టీటీడీ గుగూల్ తో ఒప్పందానికి సిద్దమైంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉచితంగా అందించేలా గుగూల్ ఇప్పటికే తమ సంసిద్దత వ్యక్తం చేసింది. వచ్చే వారం రోజుల్లో టీటీడీతో గుగూల్ ఈ మేరకు ఎంఓయూ చేసుకోనుంది. గుగూల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐ వినియోగించనున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురైన అనుభవాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు.
దర్శనం - వసతి
ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐ వినియోగిస్తున్నా.. భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గుగూల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్ లో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది. దర్శన విధి విధానాలు, వస్త్ర ధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావాల్సిన భాషల్లో సమాచారం అందించనున్నారు.

మొబైల్ లో సమాచారం
మరో వైపు గుగూల్ మ్యాప్ ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆ ర్వో) అన్నప్రసాద కేంద్రం, కల్యాణ కట్ట వద్ద రద్దీ ఎలా ఉందో నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్ప డుతుంది. భక్తుల ఫోన్లకే సమాచారం వచ్చేలా అనుసంధానం చేస్తున్నారు. క్యూ లైన్ల నియంత్రణ తో పాటుగా భక్తులు వేచి ఉండకుండా చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. ఏఐ కెమేరాలను తిరుమలలో గుగూల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులకు అడ్డుకట్ట వేసేందుకు ఏఐ మేలు చేస్తుందని భావిస్తున్నారు.
భక్తులకు ప్రత్యేక ఐడీ
ఇక, ఏఐ విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్ లో ఆ భక్తుడు ఆ ఐడీ ద్వారానే దర్శనం.. సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు.. ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తులు సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలను అందించే అవకాశం ఇవ్వనున్నారు. కాగా, ఈ ఏఐ ఆధారిత సేవలు తిరుమలలో అందుబాటులోకి వస్తే భక్తులకు జరిగే ప్రయోజనాల పైన ఇప్పుడు గుగూల్ తో టీటీడీ ఒప్పందం వేళ ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications