TTD: ఆన్‌లైన్ లోనే బ్రేక్ దర్శనాల బుకింగ్ - ఇక వారికీ ఛాన్స్..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలకు సిద్దమైంది. భక్తులకు వేగంగా దర్శనంతో పాటుగా వసతి విషయంలో కొత్త మార్పులకు రంగం సిద్దం చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఇక, బ్రేక్ దర్శనాల్లో మార్పులు తెచ్చేలా కొత్త ప్రణాళికల పైన ఆలోచన చేస్తోంది. బ్రేక్ దర్శనాలకు ఉన్న డిమాండ్ కారణంగా అమలు లో పూర్తి పారదర్శకంగా.. నిర్దేశిత సంఖ్యలో అనుమతించేలా నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఆన్‌లైన్ లోనే బ్రేక్ దర్శనాల బుకింగ్ అమలు చేయనుంది.
బ్రేక్ దర్శనాల కోసం
తిరుమలలో ఆన్‌లైన్ ద్వారా మూడు నెలల ముందే దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఉచిత దర్శనం కోసం వచ్చే వారి విషయంలో ఎలాంటి పరిమితులు విధించ లేదు. అదే విధంగా సిఫార్సు లేఖలతో దర్శనాలకు వచ్చే వారి సంఖ్య ప్రతీ రోజు పెరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖలు అనుమతించేలా టీటీడీ నిర్ణయించింది. లేఖల ద్వారా తిరుమలకు వస్తున్న వారి నుంచి టీటీడీ అధికారుల పైన ఒత్తిడి పెరుగుతోంది. పరిమితికి మించి చివరి నిమిషంలో దర్శనాలకు అనుమతించేలా సిఫార్సులు ఉంటున్నాయి. దీంతో, ఈ విధానం లో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది.

తాజా ప్రణాళికలు
అందులో భాగంగా రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునే లా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. నిత్యం దాదాపు 60-70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వారాంతాలు, విశేష పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుతోంది. అయితే స్వామి దర్శనానికి వచ్చేవారిలో సగానికి పైగా బ్రేక్ దర్శనాల కోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల లేఖలతో ప్రయత్నాలు చేస్తున్నారు. టీటీడీ అధికారుల పైన ఒత్తిడి పెంచుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధుల నుంచి రోజుకు రెండు, మూడు లేఖలు కూడా వస్తున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేలా టీటీడీ గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించింది.
ముందుగానే బుకింగ్
ఈ విధానం ద్వారా బోర్డు సభ్యులు తమ కోటాకు తగినట్టు వారే ఆన్‌లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అందజేసేవారు. ఇప్పుడు ఇదే విధానం అందరు ప్రజాప్రతినిధులకూ అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది. నూతన విధానం అమలులోకి తెస్తే ఆయా ప్రజాప్రతినిధులే తమ కోటాకు తగినట్టు ఆన్‌లైన్ ద్వారా బ్రేక్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ విధానంలో నేతలు వంద శాతం కోటాను వినియోగించుకుంటారనే అభిప్రాయం కూడా వ్యక్తం అయిది. ఈ విధానం అమల్లో సామాన్య భక్తు లకు ఇబ్బంది లేకుండా తగిన విధంగా మార్పుచేర్పులు చేయాలని టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో, లేఖలతో తిరుమలలో అధికారుల వద్దకు వెళ్లకుండానే ముందుగా దర్శనం పైన భక్తులకు స్పష్టత..సమయం ఖరారు అయ్యేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications