తిరుమలకు వెళ్లే భక్తుల కోసం గుడ్ న్యూస్
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 77,893 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,604 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
ఈనెల 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా ఈ సందర్భంగా చర్చించారు.

భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ 435 బస్సులు తిరుమలకు నడిపిస్తోందని, బ్రహ్మోత్సవాల సమయంలో అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకొస్తుందని వెంకయ్య చౌదరి తెలిపారు. దీని ద్వారా సుమారు 1.60 లక్షల మంది భక్తులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేశారు. వాహనాల పార్కింగ్ కోసం తిరుపతిలో 23 ప్రదేశాలను గుర్తించినట్లు వివరించారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉందని తెలిపారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 4,200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్‌మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ లో గుర్తిస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి, రాజ్యాంగపరమైన అధినేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెంకయ్య చౌదరి చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. వీలైనంత వరకు సురక్షితమైన ప్రజా రవాణా సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications