బిగ్ పేరుతో తిరుమల కొత్తగా..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 78,320 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,950 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కొత్తగా తిరుమలలో బిగ్, జనత క్యాంటీన్లను నెలకొల్పడానికి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. తిరుపతిలోని టీటీడీ అడ్మిన్ బిల్డింగ్ లో ఈ సమావేశం ఏర్పాటైంది.
తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్ల నిర్వహణ కోసం గత నెల 23వ తేదీ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫిషన్ జారీ చేసింది టీటీడీ. ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్ హోటల్ యజమానులతో ప్రీ బిడ్ మీటింగ్ ను నిర్వహించారు శ్యామల రావు. ఈ సందర్భంగా శ్యామలరావు వారికి పలు సూచనలు ఇచ్చారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు బిగ్, జనతా క్యాంటిన్లలో నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని సూచించారు. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారని, వారికి సేవా దృక్పథంతో లాభాపేక్ష లేకుండా నిర్ధేశించిన ధరలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు.
తిరుమలలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు, పరిశుభధ్రత తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని శ్యామలరావు చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఆహార పదార్థాలను విక్రయించకూడదన, నిర్దేశించిన రేట్ల ప్రకారమే వాటిని అందించాలని వారిని ఈఓ అన్నారు. నిర్థారించిన నియమాలకు లోబడి బిగ్, జనతా క్యాంటిన్ లో కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బిగ్, జనతా హోటళ్ల నిర్వహణలో టెండర్ ప్రాసెస్, తదితర నియమ నిబంధనలను గుర్తింపు, ఆసక్తి ఉన్న హోటళ్ల నిర్వాహకులు నివృత్తి చేసుకున్నారు. హోటళ్ల నిర్వాహకులు పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని టిటిడీ ఈవో, అదనపు ఈవో నివృత్తి చేశారు.












Click it and Unblock the Notifications