తిరుమలలో అంతర్జాతీయ స్థాయిలో..
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 75,740 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,958 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర పురావస్తుశాఖ అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటైన ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సివిల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ పనులు, మ్యూజియం గైడ్స్, భద్రత, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. ఈ పురావస్తుశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ప్రపంచ స్థాయి ఆధునిక మ్యూజియంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విఖనసాచార్యుల సన్నిధికి..
తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉత్తర మాడ వీధిలో గల శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీ విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమి నాడు జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్యకైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ వైఖానస ఆగమశాస్త్రాన్ని శ్రీ విఖనస మహర్షి రచించారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు.
టీటీడీకి భారీ విరాళం..
హైదరాబాద్ కు చెందిన క్యాప్ స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ టీటీడీకి భారీ విరాళాన్ని అందజేశారు. ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాదం ట్రస్టుకు, మిగిలిన 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వెంకయ్య చౌదరికి చెక్కులను అందజేశారు.












Click it and Unblock the Notifications