టీటీడీ ఆలయాల్లో నెలంతా పండగ రోజులే: తిరుమలలో రద్దీ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 81,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,244 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.94 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది.

తిరుమల సహా టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో నిర్వహించనున్న ఉత్సవాలు, విశేష పూజల వివరాల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నారాయణవనంలో వెలిసిన శ్రీపరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
10 నుంచి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు, 16 నుంచి 18వ తేదీ వరకు తిరుపతి శ్రీగోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం, 17 నుంచి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీసిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ.
18 నుంచి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, 18 నుండి 22వ తేదీ వరకు శ్రీవిఖనశాచార్య ఉత్సవాలను వైభవంగా చేపట్టనుంది. 21వ తేదీన గురు పూర్ణిమ సందర్భంగా తిరుమలలో శ్రీవారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది.
26వ తేదీన శ్రీసిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం, 29న శ్రీఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం, 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించింది. అదే రోజున ఆడి కృతిక, 31వ తేదీన సర్వ ఏకాదశిని నిర్వహిస్తామని పేర్కొంది.












Click it and Unblock the Notifications