తిరుమలకు ఆ టిక్కెట్లు ఉంటే మాత్రం రండి, లేదంటే దయచేసి రావద్దు, పరిస్థితి !
తిరుమల/తిరుపతి: జీవితంలో ఒక్కసారి అయినా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని దేశం నలుమూలలోని ప్రతి హిందువు అనుకుంటాడు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటే జీవితం ధన్యం అవుతుందని, చేసిన పాపాలు మొత్తం పోతాయని శ్రీవారి భక్తుల నమ్మకం. అదే జగమెరిగిన సత్యం అని అనేకసార్లు రుజువు అయ్యింది.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.

వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లు లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతున్నది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం అందిస్తున్నారు.

ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే శనివారం మధ్యాహ్నానికి దాదాపు 79 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 80 వేల మందికి అన్నప్రసాదాలతో పాటు ఉప్మా, పొంగల్ పంపిణీ చేశారు.
సాధారణంగా ప్రతిరోజు కంటే శనివారం రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు.
అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తిరుమలలోని క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
భక్తుల అధిక రద్దీ కారణంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్ ఎస్ డీ టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి భక్తులు లక్ష మందికి పైగా ఒకేసారి తిరుమలకు చేరుకోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications