తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై తేల్చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై స్పష్టత ఏర్పడింది. 10 రోజుల పాటు కొనసాగుతున్న ఉత్తర ద్వార దర్శనాలను రెండు రోజులకే పరిమితం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తెర దించింది. ఇప్పుడున్న వ్యవస్థనే కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. దీన్ని కుదించట్లేదని, ఇప్పట్లాగే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి తీర్మానించింది.
ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలకమండలి సమావేశంలో తీసుకున్ నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాల గురించి వివరించారు.

- ఇటీవలే ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందించింది.
- తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు టీటీడీ తీసుకుంటుంది.
- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా మరో 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.
- టీటీడీ గోశాల నిర్వహణకు సబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు టీటీడీ తీసుకుంటుంది.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించే ప్రతిపాదనలను టీటీడీ ఆమోదించింది.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం.
- కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కొరకు పంపాలని నిర్ణయం.
- భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చెన్నై టీ.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చదరపు అడుగుల స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.
- కరీంనగర్ లో గల శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయం.
- వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయం.
- టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఏసీబీతో విచారణ జరపాలని నిర్ణయం.
- ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం.












Click it and Unblock the Notifications