8టన్నుల పూలతో తిరుమల శ్రీవారి పుష్పయాగం నేడే... విశేషాలివే!
కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి నేడు తిరుమల లో అత్యంత ఘనంగా పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రకాల సువాసనలు వెదజల్లే పుష్పాలతో, పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి పుష్పార్చనలను నిర్వహిస్తున్నారు.
పుష్పయాగం నిర్వహణ వెనుక
ఇక ఈ ఉత్సవం నేడు శ్రీవారి ఆలయ సంపంగి ప్రకారములోని కళ్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల ఏవైనా దోషాలు జరిగితే ఆ దోషాల నివారణ కోసం పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. తిరుమల స్వామివారి పుష్పయాగం 15వ శతాబ్దంలో మొదలైంది. అయితే మధ్యలో కొంతకాలం నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని మళ్లీ 1980లో పునరుద్ధరించారు.

పుష్ప యాగానికి నిన్న రాత్రి అంకురార్పణ
పుష్ప యాగం సందర్భంగా నేడు తిరుమలలో స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. ఇక తోమాల సేవ, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు జరగనున్న పుష్పయాగ మహోత్సవానికి నిన్న రాత్రి శాస్త్రంగా అంకురార్పణ చేశారు.
8 టన్నుల పూలతో వైభవంగా పుష్ప యాగం
ఇక నేడు ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవం మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఐదు గంటల వరకు ఉత్సవాన్ని కొనసాగిస్తారు. పుష్పయాగానికి ఎనిమిది టన్నుల పుష్పాలను పత్రాలను వినియోగిస్తారు. ముందుగా ఉద్యానవన విభాగం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు పుష్పాల ఊరేగింపు వైభవంగా జరుగుతుంది.
పుష్ప యాగానికి వాడే పూలు ఇవే
అనంతరం శ్రీ మల్లయ్య స్వామికి 20 సార్లు వివిధ రకాల పుష్పాలను సమర్పిస్తారు. విగ్రహాలకు నిలువెత్తు వరకు పుష్ప నివేదన చేసి సహస్ర దీపాలంకార సేవను చేస్తారు. ఇక నేడు స్వామివారికి చామంతి, సంపంగి, పొగడ, జాజి, గులాబీ, గన్నేరు, మల్లెపూలు, కనకాంబరం, మొగలి, నిత్యమల్లి, మనోరంజితం, పారిజాతం, తామర, కలువ తదితర పుష్పాలతోనూ తులసి, మరువం, దవణం, బిల్వం, కదిరి పచ్చపత్రాలతోనూ పూజలు నిర్వహిస్తారు.
కన్నుల పండుగగా మలయప్ప స్వామి పుష్పయాగం
ఈ పుష్పయాగానికి పువ్వులను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కు చెందిన దాతలు విరాళంగా అందిస్తారు. పుష్పయాగం చేసి సహస్ర దీపాలంకరణ సేవ చేసిన తర్వాత ఆలయ మాడవీధుల్లో దేవేరులతో సమేతంగా ఉన్న శ్రీ మల్లయ్య స్వామి వారిని ఊరేగిస్తారు. ఇక ఈ ఘట్టం కన్నుల పండుగగా సాగుతుంది.












Click it and Unblock the Notifications