శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం ఎదురు చూసే భక్తులకు గుడ్ న్యూస్
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తోన్నారు. రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటోంది.
శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లపై కీలక ప్రకటన చేసింది టీటీడీ. సోమవారం నుంచి ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇదివరకు సర్వ దర్శనం టోకెన్లను జారీ చేయడాన్ని టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఎస్డీ టోకెన్లకు బ్రేక్ వేసింది.. తాత్కాలికంగా.

ఇక- శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. అర్ధరాత్రి 12 గంటలకు ఉత్తర ద్వారాన్ని- వేద మంత్రోచ్ఛారణల మధ్య మూసివేస్తారు టీటీడీ అర్చకులు. దీనితో ఈ రద్దీ పూర్తిగా తగ్గుతుంది. ఫలితంగా- సర్వదర్శనం టోకెన్లను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది.
సర్వదర్శనం టోకెన్లను ఉదయం 4 గంటల నుంచి జారీ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి. ఈ టోకెన్ల కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న కారణంగా- తొలి గంట నుంచే వారి తాకిడి తీవ్రంగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది.
దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. టోకెన్లను జారీ చేసే కౌంటర్ల వద్ద భక్తులకు మంచినీళ్లు, ఇతర వసతులను కల్పించింది. రద్దీని నివారించడానికి క్యూలైన్లను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications