తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కుదింపు?
Tirumala: తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం కొనసాగుతోంది. తిరుమల అన్నమయ్య భవన్ లో ఈ భేటీ ఏర్పాటైంది. ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సుమారు 100కు పైగా అంశాలు ఈ సందర్భంగా పాలకమండలి సమావేశంలో చర్చకు రానున్నాయి. వీటిపై క్షుణ్ణంగా చర్చించిన అనంతరం వాటి తీర్మానాలను ఆమోదించనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించడాన్ని రెండు రోజులకు కుదించాలనే ప్రతిపాదనలు టీటీడీ పరిశీలనలో ఉన్నాయి.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనాలకు అనుమతివ్వాలన్న టీటీడీ పాలకమండలి నిర్ణయం దైవ ద్రోహమేనని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో పీఠాధిపతులు, వైఖానస ఆగమ పండితుల సలహా, ఆశీర్వాదంతో ఈ ఉత్సవాల ద్వారా ఏటా 10 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం లభించిందని గుర్తు చేశారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతేడాది వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల జారీలో పాలకమండలి నిర్వహణా వైఫల్యంతో ఆరుమంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయాలపాలవడం దురదృష్టకరమని, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందే కాక, శ్రీరంగం ద్రావిడ సంస్కృతి అంటూ పాలకమండలి చైర్మన్ బీ ఆర్ నాయుడు వితండవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని భూమన మండిపడ్డారు.
వైకుంఠ ఏకాదశ పర్వదినాల సందర్బంగా లక్షలాదిమంది భక్తులకు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించాలన్న సదాశయంతో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ గతంలో ఇదే పోస్టులో ఉన్నారని ఆయనగుర్తు చేశారు. దీనికి సంబంధించి నలుగురు పాలకమండలి సభ్యులు, అడిషనల్ ఈవో తో సబ్ కమిటీ కూడా వేశామని భూమన చెప్పారు.
దీని కోసం 26 మంది పీఠాధిపతుల అంగీకారంతో పాటు తిరుమల వైఖానస ఆగమ పండితుల సలహాలు, పెద్ద జీయర్ స్వామివారి సూచనలు కూడా తీసుకున్నామని, దాదాపు 32 మంది ప్రముఖలు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తం అని అన్నారు. శ్రీరంగం తర్వాత దివ్యదేశాల్లో రెండోది పేరుగాంచిన తిరుమలలో ఈ విధానంలో పూర్వకాలంలో ఉండేదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితం అయిందని చెప్పారు
10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఆలోచన అత్యంత శ్రేయస్కరమని, దీని ద్వారా సామాన్య భక్తులకు ఎక్కువ రోజుల పాటు స్వామి వారి వైకుంఠద్వార దర్శనం అందజేయడం మంచిదని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని శృంగేరి, అహోబిలం, పరకాల, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్రస్వామి మఠం, ఆండవన్ ఆశ్రమం శ్రీరంగం, కాంచీపురం శంకరాచార్య మఠం, వానమలై మఠం, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్, ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం వంటి ప్రముఖులైన వారందరూ ఈ దర్శనాలకు తమ అమూల్యమైన అంగీకారించారని అన్నారు.
శ్రీమహావిష్టువుకు దైవమానకాలం ప్రకారం ఏకాదశి పర్వం 10 రోజులు ఉంటుందని భూమన అన్నారు. దాన్ని అమలు చేయడం చేతకాక, చేష్టలుడిగి, చేతులెత్తేసిన ఈ పాలకమండలి తమ పైరవీకారులకు ఎలా దర్శనం టిక్కెట్లు ఇప్పించాలని పరస్పరం తమలో తాము కొట్లాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. టీటీడీ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాంప్రధాయన్ని ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications