తుని మైనర్ అత్యాచారయత్నం ఘటనలో బిగ్ షాక్..!
ఏపీలోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు.. స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి మైనర్ బాలికను హాస్టల్ నుంచి "ఇంటికి తీసుకెళ్తాను" అని చెప్పి.. సమీపంలోని సపోటా తోటలోకి తీసుకెళ్ళాడు. ఓ యువకుడు ఈ విషయాన్ని గమనించి వీడియో తీస్తూ వారిని ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే నారాయణ రావు తాను టీడీపీ నాయకుడిని అని.. మున్సిపల్ కౌన్సిలర్‌ని అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత బాలిక గ్రామస్థులు నారాయణరావును పట్టుకుని దేహశుద్ది చేశారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, అనిత కూడా దీనిపై స్పందించారు.

టీడీపీ సైతం ట్విట్టర్ వేదికగా ఘటనపై రియాక్ట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నారాయణరావుపై పోక్సో కేసుతో పాటు కిడ్నాప్, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీహరి రాజు వెల్లడించారు.
తప్పించుకునేందుకు ప్రయత్నం.. కానీ !
కాగా నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని చెప్పి నారాయణరావును వాహనాన్ని ఆపారు.. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న కోమటి చెరువులో దూకినట్లు చెబుతున్నారు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి అతడి కోసం చెరువులో గాలించగా.. చివరికి మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్ కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బాలిక కుటుంబానికి సంబంధం లేని వ్యక్తితో ఆమెను ఎలా పంపిస్తారని గురుకుల పాఠశాల యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల, స్థానిక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని సర్వత్రా మండిపడుతున్నారు. బాలికపై నారాయణరావు ఇప్పటికే పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని సైతం ఆరోపిస్తూ.. ఆమెకు వైద్య పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా నిందితుడు నారాయణరావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications