అన్ని హంగులతో కృష్ణాపై బ్రిడ్జి: బాబును ఆకట్టుకున్న కూచిపూడి డ్యాన్స్ భంగిమ
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై రెండంతస్తుల ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. కాజ - పెద అవుటుపల్లి మధ్య విజయవాడ బైపాస్ రహదారిలో భాగంగా నిర్మిస్తారు.
విజయవాడ: విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై రెండంతస్తుల ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. కాజ - పెద అవుటుపల్లి మధ్య విజయవాడ బైపాస్ రహదారిలో భాగంగా నిర్మిస్తారు.
కూచిపూడి నృత్య భంగిమను పోలిన ఆకృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. రెండంతస్తులతో సిద్ధం చేసిన మరో ఆకృతిని దీనితో మేళవించి పదిహేను రోజుల్లో తుది రూపాలు సిద్ధం చేయాలని చెప్పారు.

బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాజధానిపై సమీక్షా సమావేశం జరిగింది. ఎల్ అండ్ టీ సంస్థ రూపొందించిన ఆరు డిజైన్లను పరిశీలించారు. ఏపీకి చెందిన సంప్రదాయ కూచిపూడి భంగిమను పోలిన డిజైన్ బాగుందన్నారు.
పుష్పాన్ని పోలినట్లుగా రెండంతస్తులతో రూపొందించిన మరో డిజైన్ కూడా చంద్రబాబును ఆకట్టుకుంది. ఆ ఆకృతిలో వాహనాలు వెళ్లడానికి, పాదచారులకు వేర్వేరు మార్గాలు ప్రతిపాదించారు.
వంతెన పైభాగంలో మారథాన్, జాగింగ్, యోగా, వీధి వేడుకలు, ఫుడ్ కోర్డులు, సైక్లింగ్, ఉత్సవాలకు వినియోగించవచ్చునని సూచించారు. వీటిని పరిశీలించిన చంద్రబాబు రెండు, నాలుగు డిజైన్ల మేళవింపుగా వంతెన ఉండాలన్నారు.
రెండంతస్తుల బ్రిడ్జిలో పైభాగాన్ని వినోద, క్రీడా ప్రదేశంగా తీర్చిదిద్దవచ్చన్నారు. పై నుంచి నదికి ఉపమార్గాలుంటే అక్కడ జలక్రీడలకు అనువైన థీమ్ పార్కులు ఏర్పాటు చేయవచ్చునని చెప్పారు.
జల క్రీడలకు అనువుగా బ్రిడ్జి నిర్మించే ప్రాంతంలో నదిలో దీవులు ఏర్పాటు చేయవచ్చన్నారు. కన్యాకుమారి తరహాలో వారధి పైభాగం సూర్యోదయ వీక్షణకు వీలుగా వ్యూపాయింట్‌గా నిలిచిపోవాలని తెలిపారు.
బ్రిడ్జి పైభాగంలో ఫుడ్ కోర్టులు, షాపింగ్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. రాజధాని అమరావతిలో ప్రవేశించేందుకు కృష్ణా నదిపై నిర్మించే మొదటి బ్రిడ్జి ఇది. కాబట్టి అధ్భుతంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications