ఆడుతూ ఎక్కితే అక్కాచెల్లెళ్లను కారు మింగేసింది
భీమవరం: ఆడుకుంటూ పోయి నిలిపి వుంచిన కారు ఎక్కిన చిన్నారులు ఊపిరి ఆడక మృత్యువాతపడిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం చోటు చేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఈ ఘటనలో మృతిచెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన మరో సోదరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
భీమవరం బ్యాంకు కాలనీలో నివసిస్తున్న యిర్రింకి లక్ష్మీనారాయణకు తేజస్విని (9), ఈశ్వరి (6), లక్ష్మీదుర్గ (4) అనే ముగ్గురు మనుమరాళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మరో గ్రామంలో నివాసం ఉండటంతో తాత ఇంటివద్ద ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముగ్గురు బాలికలు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.

అప్పటి నుండి వారి ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు రాత్రి 9 గంటల సమయంలో సమీపంలో నిలిపివుంచిన కారులో వీరు ముగ్గురు అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
వెంటనే వారిని బయటకు తీసి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఈశ్వరి, లక్ష్మీదుర్గ మృతిచెందారు. కొనవూపిరితో ఉన్న ఒక బాలికను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.












Click it and Unblock the Notifications