30 ఏళ్ల ప్రత్యర్థి ఇంటికి వెళ్లిన YCP MLA!
30 సంవత్సరాల నుంచి వేర్వేరు పార్టీల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ చేతులు కలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిస్థితులు, ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కంభంతో కలిసి నడుస్తానని మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నానని, తాను, విజయరామిరెడ్డి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసన్నారు. ఉదయగిరి అభివృద్ధికి ఇద్దరం కలిసి కృషిచేస్తామన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా 30 సంవత్సరాల నుంచి హోరాహోరీగా తలపడిన వీరిద్దరూ సమావేశం కావడం రాజకీయంగా సంచలనం కలిగించింది. మేకపాటి టీడీపీలోకి వెళతారనే చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆయన టీడీపీ నేత ఇంటికి వెళ్లారు.

వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయడానికి మేకపాటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ ఛార్జిగా బొల్లినేని రామారావు ఉన్నారు. టికెట్ విషయంలో మద్దతు కోరేందుకు విజయరామిరెడ్డిని మేకపాటి కలిశారని వార్తలు వస్తున్నాయి. వైసీపీ కూడా ఉదయగిరికి ఇన్ ఛార్జిని నియమించలేదు. మేకపాటి అభినయ్ రెడ్డి పేరు ప్రధానంగా వినపడుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనే ఆరోపణలతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కూడా వేటు వేసింది. వైసీపీ నేతలతో మేకపాటి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ప్రత్యర్థి ఇంటికి మేకపాటి వెళ్లడంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.












Click it and Unblock the Notifications