రామోజీ మృతితో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక నిర్ణయం..!
మీడియో మొఘల్, రామోజీ గ్రూపు సంస్థల అధినేత అయిన చెరుకూరి రామోజీరావు ఇవాళ మృతిచెందారు. ఆయన మృతిపై పలువురు సంతాప సందేశాలు ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనతో సుదీర్ఘ పోరాటం చేసిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు. రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. మార్గదర్శి చిట్స్ వ్యవహారంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి రామోజీరావుపై పోరాడారు.
రామోజీ మృతిపై ఇవాళ స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇది బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎవరితో రాజీపడకుండా పూర్తి జీవితం గడిపారని ఉండవల్లి గుర్తుచేసుకున్నారు. ఆయన్ను కలుద్దామని చాలాసార్లు ప్రయత్నించినట్లు ఉండవల్లి తెలిపారు. ఈ విషయంపై తాను సంతృప్తిగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఓ ఫైటర్ గానే ఆయన జీవితకాలం గడిపారన్నారు.

రామోజీరావు ఏ రంగంలో ప్రవేశించినా ఓ సెలబ్రిటీ స్థాయికి ఎదిగారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. భారత్ లోనే పలుకుబడి కలిగిన రామోజీ వంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదన్నారు. ఆయనే లేనప్పుడు ఇక ఆయనపై పోరాటం ఉండదని ఉండవల్లి తేల్చిచెప్పేశారు. తద్వారా మార్గదర్శి చిట్స్ పై తన పోరాటం విరమించుకుంటున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు.
దీంతో రామోజీరావు కు చెందిన మార్గదర్శి చిట్స్ పై వైఎస్ హయాంలో ఉండవల్లి మొదటిపెట్టిన పోరాటం ముగిసినట్లయింది.












Click it and Unblock the Notifications