రెండు రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు: ఈ రూట్ లో- ప్లాన్ అప్రూవ్డ్
రైల్వే నెట్‌వర్క్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. తాజాగా మరిన్ని సెమీ హైస్పీడ్ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ క్రమంలో అమృత్ భారత్, రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ ఆర్ఆర్టీఎస్ రైళ్లను మరింత విస్తరించబోతోంది కేంద్రం. ఢిల్లీ నుంచి రుషికేశ్‌కు ప్రయాణించే భక్తులు, పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అద్భుతమైన తీపి కబురు అందించాయి. నమో భారత్ సెమీ హైస్పీడ్ రీజినల్ రైలు సర్వీసును మీరట్ నుంచి రుషికేశ్ వరకు పొడిగించేందుకు కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

దీంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం నుంచి రుషికేశ్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి మీరట్ వరకు 82 కిలోమీటర్ల మేర నమో భారత్ కారిడార్ అందుబాటులో ఉంది. గత ఏడాది జనవరిలో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు ఈ మార్గానికి అదనంగా మరో 150 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతో మొత్తం కారిడార్ పొడవు సుమారు 230 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ నమో భారత్ సెమీ హైస్పీడ్ రైళ్ల ద్వారా ఢిల్లీ-రుషికేశ్ ప్రయాణ సమయం మూడు గంటలకు తగ్గిపోతుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 150 కిలోమీటర్ల నూతన రైలు మార్గంలో 72 కిలోమీటర్ల భాగం ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, మిగిలిన 78 కిలోమీటర్ల మార్గం ఉత్తరాఖండ్‌లో నిర్మించనున్నారు. ఈ కొత్త రైలు మార్గం మీరట్ స్టేషన్ నుండి ప్రారంభమై ముజఫర్‌నగర్ మీదుగా ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశిస్తుంది.
అక్కడ రూర్కీ, హరిద్వార్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన హర్ కీ పౌరీ ఘాట్ మీదుగా ప్రయాణిస్తూ రుషికేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన లక్ష్మణ్ ఝూలా వరకు చేరుకుంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గతంలో ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆ తర్వాతే ఈ ఒప్పందం కుదిరింది. ఈ కొత్త కారిడార్ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేసేందుకు త్వరలోనే అధికారికంగా సర్వే ప్రారంభం కానుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అదనపు కార్యదర్శి రీనా జోషిని నోడల్ అధికారిగా నియమించింది. అదేవిధంగా ఎన్‌సీఆర్‌టీసీ కూడా తమ సంస్థ తరఫున ఒక నోడల్ అధికారిని కేటాయించింది.












Click it and Unblock the Notifications