పవన్ ఆ వ్యాఖ్యలెందుకు ? బాబు, జగన్ ఎందుకు వెనకడుగు ? ఉండవల్లి షాకింగ్..!
ఏపీలో రాజకీయ ప్రత్యర్దులపై పదునైన వ్యాఖ్యలు చేసే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలపై చేసిన విమర్శలతో పాటు అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరినీ ప్రశ్నించారు.
తెలంగాణపై డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. డిప్యూటీ సీఎం స్థానంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడని తాను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. తద్వారా పవన్ వ్యాఖ్యలు ఆయనకూ మంచిది కాదని ఉండవల్లి తేల్చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తెస్తున్న సీఎం చంద్రబాబు తన వ్యాపారాలను హైదరాబాద్ నుంచి ఏపీకి ఎందుకు తీసుకురావడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు.

చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయంతో పాటు జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. మరోవైపు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులది రాజకీయ స్నేహం మాత్రమేనని, వారి మనస్సులు మాత్రం ఎప్పుడూ కలవవని ఉండవల్లి తెలిపారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాత ఆర్ఎస్ఎస్‌లో నుంచి తాను బయటకు వచ్చానని ఉండవల్లి గుర్తుచేసారు. హిందూమతంపై 1964లో ఓ తీర్పు ఇచ్చారని, హిందుత్వం అనేది మతం కాదని, సనాతన ధర్మమని తెలిపారు. బీజేపీ నేతలు రాజకీయం కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. నార్త్ తరహాలో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని తేల్చేశారు. భారత్‌లో అమాయకుల జోలికి వచ్చే పాకిస్థాన్ టెర్రరిస్టులను కాల్చి పడేయాలన్నారు.












Click it and Unblock the Notifications