కారుకూతలంటున్నారు: బాబుకు ఉండవల్లి ఘాటుగా, రెండు ప్రభుత్వాలు ఛీ!: బైరెడ్డి
రాజమండ్రి/కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు ఘాటు లేఖ రాశారు. ఏ అంశంలోను ప్రభుత్వానికి పారదర్శకత లేదని మండిపడ్డారు.
తాను బహిరంగ చర్చకు అడిగితే, తనవి కారుకూతలు అని మంత్రి అంటున్నారని మండిపడ్డారు. తన ప్రశ్నలకు కనీసం అధికారితోనైనా వివరణ ఇప్పించాలని ఆయన తన లేఖలో సీఎం చంద్రబాబును కోరారు.
రాజధాని, విద్యుత్, గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట పైన ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అడిగిన ప్రశ్నలన్నీ ప్రజా సంబంధమైనవేనని చెప్పారు.

ప్రభుత్వం చేపడుతున్న పథకాల పైన చర్చకు సిద్ధమని ప్రకటించిన తన సవాల్‌ను ఓ మంత్రి పిచ్చికూతలంటూ వ్యాఖ్యానించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. మంత్రులకు వీల్లేకుంటే అధికారితోనైనా ఇప్పించాలన్నారు.
రాయలసీమ నష్టపోతుంది: బైరెడ్డి
డెల్టా రైతుల పైన ఉన్న ప్రేమ వల్ల రాయలసీమ రైతులు నష్టపోతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో నిండకముందే నాలుగు టీఎంసీల నీరు విడుదలకు రెండు ప్రభుత్వాలు నిర్ణయం సిగ్గుచేటు అన్నారు. శ్రీశైలం నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల రాయలసీమ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అన్నారు.












Click it and Unblock the Notifications